Hyderabad: భారతీయ చలనచిత్ర రంగంలో తెలుగు సినిమా పాత్ర కీలకం: రమణాచారి
- 'మా'కు ‘86 వసంతాల తెలుగు సినిమా’ పుస్తకం బహూకరణ
- ఫిల్మ్ చాంబర్ లో నిర్వహించిన కార్యక్రమం
- పాల్గొన్న పలువురు సినీ ప్రముఖులు
భారతీయ చలనచిత్ర రంగంలో ‘తెలుగు సినిమా’ పాత్ర కీలకమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రమణాచారి అన్నారు. ఫిల్మ్ ఎనలిటికల్ అండ్ అప్రిసియేషన్ సంస్థ అధ్యక్షుడు ధర్మారావు రచించిన ‘86 వసంతాల తెలుగు సినిమా’ పుస్తకాన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ప్రతినిధులకు రచయిత బహూకరించారు. హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ‘మా’ అధ్యక్షుడు నరేశ్, టీడీపీ ఎంపీ, నటీనటుల సంఘం మాజీ అధ్యక్షుడు మురళీమోహన్, ఎఫ్డీసీ చైర్మన్ రామ్మోహన్ రావు, పరుచూరి బ్రదర్స్ తదితరులు హాజరయ్యారు.
ముఖ్య అతిథిగా హాజరైన రమణాచారి మాట్లాడుతూ, ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో తాపీ ధర్మారావుకు పెద్ద పేరు ఉండేదని, ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ఈ పుస్తక రచయిత ధర్మారావుకు పేరుందని కొనియాడారు. ఈ పుస్తకం ధర్మారావు రాయడం సంతోషమని, ఆ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరింపజేసుకోవడం మరింత సంతోషాన్ని కలిగించిందని చెప్పారు.