srinu master: మహ్మద్ రఫీ .. లతా మంగేష్కర్ డబ్బులు తీసుకోకుండా వెళ్లిపోయారట: సీనియర్ కొరియోగ్రఫర్ శ్రీను మాస్టర్
- 'సువర్ణ సుందరి' హిందీలో రీమేక్ చేశారు
- ఈ సినిమాకి నృత్యదర్శకుడు మా గురువుగారు
- ఆదినారాయణరావుగారు గొప్ప సంగీత దర్శకుడు
ఎన్నో సినిమాలకి డాన్స్ మాస్టర్ గా పనిచేసిన శ్రీను మాస్టర్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. "తెలుగులో వచ్చిన 'సువర్ణ సుందరి' సినిమాను హిందీలో రీమేక్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు - అంజలీదేవి నాయకా నాయికలు. అంజలీదేవి - ఆదినారాయణరావుగారు ఈ సినిమాకి నిర్మాతలుగా వున్నారు. తెలుగు వెర్షన్ కి వెంపటి పెద్ద సత్యం గారు నృత్య దర్శకుడిగా వ్యవహరించారు. హిందీ వెర్షన్ కి కొరియోగ్రఫర్ గా మా గురువుగారు హీరాలాల్ మాస్టారు చేశారు.
హిందీ వెర్షన్ కి కూడా ఆదినారాయణరావు గారే సంగీతాన్ని సమకూర్చారు. ఆ సమయంలోనే నేను ఒక మాట విన్నాను. ఈ సినిమాలోని పాటలను మహ్మద్ రఫీ - లతా మంగేష్కర్ పాడారు. పాటల రికార్డింగ్ పూర్తయిన తరువాత వాళ్లు ఆదినారాయణరావు - అంజలీదేవి దంపతుల దగ్గరికి వచ్చి, 'ఇంత గొప్ప పాటలు మాతో పాడించినందుకు మేమే మీకు రుణపడి వున్నాము .. మాకు పారితోషికం వద్దు' అని డబ్బులు తీసుకోకుండా వెళ్లిపోయారట. దీనిని బట్టి ఆదినారాయణరావుగారు ఎంత గొప్ప సంగీత దర్శకులో అర్థం చేసుకోవచ్చు" అని అన్నారు.