Raviprakash: హైకోర్టులో ముందస్తు బెయిల్ కు టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ దరఖాస్తు... తిరస్కరించిన ధర్మాసనం!
- రవిప్రకాశ్ తరఫున న్యాయవాది పిటిషన్
- సంఘంలో పేరున్న వ్యక్తని వాదనలు
- పోలీసుల ఎదుట హాజరు కావాలని న్యాయమూర్తి సూచన
అందరూ ఊహించినట్టుగానే టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ తెలంగాణ హైకోర్టులో నేటి ఉదయం ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా, దాన్ని తిరస్కరిస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. గత కొన్ని రోజులుగా పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న ఆయనపై ఫోర్జరీ, డేటా చోరీ తదితర ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే.
సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు పంపినా, గడువులోగా ఆయన స్పందించక పోవడంతో అరెస్ట్ తప్పదని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఆయన తరఫున హైకోర్టుకు హాజరైన న్యాయవాది ముందస్తు బెయిల్ ను ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తన క్లయింట్ పోలీసుల విచారణకు సహకరిస్తారని, ఆయన సంఘంలో పేరున్న వ్యక్తని, బెయిల్ ఇవ్వాలని కోరగా, ధర్మాసనం తిరస్కరించింది. వెంటనే పోలీసుల ఎదుట హాజరు కావాలని సూచించింది.