Rahul Gandhi: చూడండి, శివరాజ్ సింగ్ ఎన్ని అబద్ధాలు చెబుతున్నారో!: రుణమాఫీ పత్రాలను చూపించిన రాహుల్
- రైతు రుణమాఫీపై కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందన్న శివరాజ్ సింగ్
- పన్ను చెల్లించే తన సోదరుడికి అది వర్తించదన్న మాజీ సీఎం
- చౌహాన్ పెద్ద అబద్ధాలకోరన్న రాహుల్
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పెద్ద అబద్ధాల కోరని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ ప్రభుత్వం చేసిన రుణమాఫీపై ఆయన అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ లబ్ధిదారుల్లో శివరాజ్ సంగ్ చౌహాన్ బంధువులు కూడా ఉన్నారని, అందుకు ఇవే సాక్ష్యాలంటూ రుణమాఫీ పత్రాలను ప్రదర్శించారు. రైతు రుణమాఫీ లబ్ధిదారుల్లో శివరాజ్ సింగ్ పుట్టిన ఊరైన జైట్‌లోని ఆయన బంధువులు రోహిత్, నిరంజన్ కూడా ఉన్నారని ముఖ్యమంత్రి కమల్‌నాథ్ పేర్కొన్నారు.
అయితే, కమల్‌నాథ్ వ్యాఖ్యలను శివరాజ్ సింగ్ చౌహాన్ కొట్టిపడేశారు. ఈ విషయమై తాను వాకబు చేశానని, తన సోదరుడు రోహిత్ రైతు రుణమాఫీకి దరఖాస్తు చేసుకోలేదని తెలిసిందని చౌహాన్ పేర్కొన్నారు. ఆయన పన్నులు కూడా కడుతుంటారని గుర్తు చేశారు. ఆయనకు రుణమాఫీ ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. చౌహాన్ వ్యాఖ్యలపై రాహుల్ స్పందించారు. శివరాజ్ పెద్ద అబద్ధాలకోరని అన్నారు. ఆయన బంధువులకు కూడా రైతు రుణమాఫీ అయిందని చెప్పడానికి ఇదే నిదర్శనమంటూ రుణమాఫీ పత్రాలను అందరికీ చూపించారు.