Telugudesam: టీడీపీ మహానాడు వాయిదా.. బదులుగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు!

  • కేంద్ర రాజకీయాల్లో బాబు బిజీ కానుండడం 
  • వాయిదాకే మొగ్గు చూపిన నేతలు
  • 1985,1991, 1996ల్లోనూ జరగని మహానాడు

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు జయంతిని పురస్కరించుకుని ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు నిర్వహించాల్సిన ‘మహానాడు’ కార్యక్రమాన్ని టీడీపీ వాయిదా వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ అధికార ప్రతినిధులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మహానాడు నిర్వహణ, కేంద్రంలో రాజకీయ పరిణామాలు సహా పలు అంశాలపై చర్చించారు. ఎన్నికల ఫలితాల విడుదలకు, మహానాడుకు మధ్య గ్యాప్ పెద్దగా లేకపోవడం, ఫలితాల విడుదల తర్వాత కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉండడంతో మహానాడును ఈసారికి వాయిదా వేయాలని నిర్ణయించారు. అయితే, ఇందుకు బదులుగా గ్రామగ్రామాన ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

నిజానికి మహానాడు నిర్వహించాలంటే కనీసం నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభించాల్సి ఉంటుంది. ఎన్నికల నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. అలాగే, ఎన్నికల ఫలితాలకు, మహానాడు తేదీకి మధ్య నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండడంతో మహానాడును ఈసారి వాయిదా వేయాలన్న నిర్ణయానికే వచ్చారు. 28న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని గ్రామాలు, పట్టణాల్లో ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాలని సమావేశంలో ఓ నిర్ణయానికి వచ్చారు. 1985,1991, 1996ల్లోనూ ఎన్నికల కారణాలతో మహానాడు నిర్వహించలేకపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News