pakistan: పాక్ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఎయిర్ డిఫెన్స్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్న భారత సైన్యం
- సరిహద్దు రాష్ట్రాల్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లపై సమీక్ష
- బోర్డర్ కు మరింత సమీపంలోకి ఎయిర్ డిఫెన్స్ సిస్టంలు
- పాక్ ఎయిర్ స్ట్రైక్స్ ను దీటుగా ఎదుర్కొనేందుకు ఆర్మీ నిర్ణయం
పాకిస్థాన్ తో ఇటీవలి కాలంలో పెరిగిన ఉద్రిక్తతలపై లోతుగా సమీక్షించిన ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దుకు సమీప ప్రాంతాల్లో ఎయిర్ డిఫెన్స్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. యుద్ధ వ్యూహాల్లో భాగమైన ఎయిర్ డిఫెన్స్ యూనిట్లతో పాటు మరిన్ని రక్షణ ఏర్పాట్లను సరిహద్దుకు వీలైనంత సమీపంలో ఏర్పాటు చేయనున్నారు. దీంతో, పాక్ నుంచి ఏ క్షణంలో ఏరియల్ స్ట్రైక్స్ జరిగినా... దీటుగా ఎదుర్కొనే వీలుంటుంది.
జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లలో ఇప్పటికే ఏర్పాటు చేసిన ఎయిర్ డిఫెన్స్ యూనిట్లపై సమీక్ష నిర్వహించామని... ఈ యూనిట్లను సరిహద్దుకు మరింత చేరువలోకి పంపించాలని ఎక్కువ మంది అధికారులు అభిప్రాయపడినట్టు ఆర్మీకి సంబంధించి ఓ ఉన్నతాధికారి తెలిపారు.
ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ యూనిట్లలో... ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ తో పాటు రష్యాకు చెందిన క్వాడ్రాట్లు, ఇతర పాత తరం సిస్టమ్ లు ఉంటాయి. డీఆర్డీ-ఇజ్రాయల్ సంయుక్తంగా తయారుచేస్తున్న ఎంఆర్-ఎస్ఏఎం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా మన బలగాలకు అందుబాటులోకి రాబోతోంది.
బాలాకోట్ పై వాయుసేనకు చెందిన మిగ్-21, సుఖోయ్-30ఎంకేఐలు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే, పాకిస్థాన్ కు మన వాయుసేన విమానాల ద్వారా జరిగిన నష్టం కంటే... మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా జరిగిన నష్టమే ఎక్కువని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను బోర్డర్ కు మరింత దగ్గర్లో ఏర్పాటు చేయడంతో పాటు, దాన్ని మరింత బలోపేతం చేసే పనిలో ఇండియన్ ఆర్మీ ఉంది.