Congress: ప్రియాంకాగాంధీని రెచ్చగొట్టిన బీజేపీ కార్యకర్తలు.. హుందాగా వ్యవహరించిన కాంగ్రెస్ నేత!

  • మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఘటన
  • ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక
  • బీజేపీ శ్రేణులతో కరచాలనం

మధ్యప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంకా గాంధీకి విచిత్రమైన అనుభవం ఎదురయింది. ఆమె కారులో వెళుతుండగా బీజేపీ కార్యకర్తలు మోదీ.. మోదీ.. మోదీ అని గట్టిగా అరుస్తూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. వెంటనే కారుదిగిన ప్రియాంక హుందాగా ప్రవర్తించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటుచేసుకుంది.

ఇండోర్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రియాంకా గాంధీ బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళుతున్నారు. దీంతో ఆమె కాన్వాయ్ వెళ్లే మార్గంలో కొందరు బీజేపీ కార్యకర్తలు గుమిగూడారు. ప్రియాంక అటుగా రాగానే ‘మోదీ.. మోదీ.. మోదీ’ అని నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు. దీన్ని గమనించిన ప్రియాంక సెక్యూరిటీ సిబ్బంది సాయంతో కారు దిగారు. అనంతరం వారి వద్దకు నేరుగా వెళ్లారు. దీంతో బీజేపీ కార్యకర్తలతో ప్రియాంక గొడవ పెట్టుకుంటారేమోనని అందరూ భావించారు.

అయితే అనూహ్యంగా ప్రియాంకా గాంధీ నవ్వుతూ బీజేపీ కార్యకర్తలను పలకరించారు. వారందరితో కరచాలనం చేశారు.  దీంతో బీజేపీ కార్యకర్తలు కూడా ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ప్రియాంక వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఉంటే కనుక, బీజేపీ కార్యకర్తలు కూడా రెచ్చిపోయేవారని, దాంతో కాంగ్రెస్ శ్రేణులు సదరు బీజేపీ కార్యకర్తలపై దాడి చేసి ఉండేవారని, అప్పుడు పెద్ద గొడవ అయ్యుండేదని, కానీ ప్రియాంక సహనంతో వ్యవహరించారని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Congress
priyanka gandhi
BJP
candidayes
modi modi slogans
shake hand
  • Error fetching data: Network response was not ok

More Telugu News