Andhra Pradesh: ఎన్నికల సంఘం వ్యవహారాల్లో వైసీపీ జోక్యం ఎక్కువైంది!: మంత్రి సోమిరెడ్డి
- కేబినెట్ బిల్లులకు వైసీపీ అడ్డు
- ఇవ్వొద్దని చెప్పడానికి విజయసాయిరెడ్డి ఎవరు?
- అమరావతిలో మీడియాతో టీడీపీ నేత
వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డిపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పేరుతో ఈసీ అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. అసలు కేబినెట్ ఆమోదించిన బిల్లులు ఇవ్వవద్దని చెప్పడానికి విజయసాయిరెడ్డి ఎవరని ప్రశ్నించారు.
దీని కారణంగా పోలవరం ప్రాజెక్టు కింద రైతులు ఓ సీజన్ ను కోల్పోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ వ్యవహారాల్లో వైసీపీ జోక్యం ఎక్కువ అయిందని విమర్శించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడారు.
రుణమాఫీ నాలుగో విడత కింద రూ.500 కోట్లు విడుదల చేస్తే ఈసీ అడ్డుకోవడం ఏంటని సోమిరెడ్డి ప్రశ్నించారు. సీఎం సహాయ నిధి కింద ఇచ్చిన చెక్కులను సైతం నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీచేయడం దారుణమని మండిపడ్డారు.
ఎన్నికల కమిషన్ నిబంధనలు చట్టపరంగా చేసినవి కావని స్పష్టం చేశారు. రోగులకు చెక్కులను ఆపేసి రాక్షసానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు.