Shane Watson: అంతలా రక్తం కారుతున్నా ఆటను మాత్రం వదల్లేదు... షేన్ వాట్సన్ గ్రేట్!
- ఫైనల్ మ్యాచ్ లో వాట్సన్ మోకాలికి గాయం
- రక్తం కారుతున్నా ఆటను కొనసాగించిన వైనం
- ఫోటోలు పంచుకున్న హర్భజన్ సింగ్
ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ ఎంతో శ్రమించినా, ఆఖరి మెట్టుపై బోల్తా పడి జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. అయితేనేం, వాట్సన్ చూపిన పోరాట పటిమను ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు. తన జట్టును దాదాపు గెలిపించినంత పని చేసిన వాట్సన్, అవుట్ కావడానికి ముందు మైదానంలో గాయపడ్డాడు.
అది ఎంత పెద్ద గాయం అంటే, మోకాలి వద్ద తగిలిన దెబ్బకు కారిన రక్తం, ప్యాంట్ ను తడిపేసి బయటకు కనిపించేంత. ఎడమ మోకాలికి గాయమై, రక్తం కారిపోతున్నా, చెన్నైని గెలిపించాలని వాట్సన్ ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే భరించలేని బాధతో వికెట్ల మధ్య పరిగెత్తలేక అవుట్ అయ్యాడు. వాట్సన్ గాయానికి సంబంధించిన వివరాలను చెన్నై ఫ్రాంచైజీ యాజమాన్యం అయితే అధికారికంగా వెల్లడించలేదుగానీ, వాట్సన్ కాలి నుంచి రక్తం కారుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. వాటిని జట్టు సభ్యుడు హర్భజన్ సింగ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నాడు. వీటిని చూసిన వారంతా 'వాట్సన్ గ్రేట్' అని కితాబిస్తున్నారు.