Narendra Modi: ఓటు హక్కు వినియోగించుకోని దిగ్విజయ్ సింగ్ కు తలంటిన మోదీ
- ఓట్లేయించుకోవడంపై ఉన్న శ్రద్ధ ఓటేయడంపై లేదేం?
- ఓటేయకుండా మహాపాపం చేశారు
- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి క్యూలో నిల్చుని ఓట్లేశారు
ఆరో విడత పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకోలేక తీవ్ర పశ్చాత్తాపానికి లోనవుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు చేశారు. ఆదివారం నాడు జరిగిన పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకోకపోవడం ద్వారా దిగ్విజయ్ సింగ్ మహాపాపం చేశాడని అన్నారు.
వాస్తవానికి దిగ్విజయ్ సింగ్ ఓటు రాఘోగఢ్ పట్టణంలో ఉంది. ఆయన భోపాల్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తుండడంతో పోలింగ్ సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ తన సొంత ఓటును నిర్లక్ష్యం చేశారు. దీనిపై ప్రత్యర్థులు తీవ్రస్థాయిలో స్పందించారు. ఇదే అదనుగా మోదీ కూడా డిగ్గీ రాజాపై విమర్శనాస్త్రాలు సంధించారు.
21వ శతాబ్దంలో దేశ భవిష్యత్తును ఓటు ద్వారా నిర్ణయించే వ్యక్తికి మీరు నేర్పే పాఠం ఇదా? అంటూ ప్రశ్నించారు. ఓటు వేయడం ఏమంత ముఖ్యం కాదని మీరు ఎప్పుడైతే భావించారో, అప్పుడే పెద్ద పాపం చేశారు అంటూ మండిపడ్డారు.
"కాంగ్రెస్ పార్టీ అహంకారం భోపాల్ లో చూశాం. దేశంలో ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ప్రజాస్వామ్య ఉత్సవం జరుగుతుంటే నేను నా ఓటు వేయడానికి అహ్మదాబాద్ వెళ్లాను. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి క్యూలో నిల్చుని మరీ ఓటేశారు. కానీ, డిగ్గీ రాజా మాత్రం ప్రజాస్వామ్యం అంటే లెక్కలేనట్టుగా వ్యవహరించారు. తనకు ఓట్లేయించుకోవడంపై ఉన్న శ్రద్ధ తాను ఓటేయడంపై లేదు. మీ ముఖ్యమంత్రితో విభేదాలు ఉంటే కనీసం పోలింగ్ బూత్ లోకి వెళ్లి బటన్ నొక్కకుండా అయినా తిరిగి రావాల్సింది" అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.