Andhra Pradesh: సుధారాణి మరణానికి కారకులైన శ్రీచైతన్య సంస్థపై మర్డర్ కేసు పెట్టాలి!: విజయసాయిరెడ్డి

  • గర్భవతిగా ఉన్న ఆమెను బలవంతంగా రప్పించారు
  • దూరప్రయాణం చేయడంతో గర్భస్రావమై చనిపోయింది
  • బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వండి

కర్నూలులో ఇటీవల శిక్షణకు హాజరైన ఉపాధ్యాయురాలు సుధారాణి(28) గర్భస్రావం జరిగి ప్రాణాలు కోల్పోవడంపై వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి స్పందించారు. సుధారాణి మరణానికి కారణమైన శ్రీచైతన్య స్కూలు యాజమాన్యంపై హత్య కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.

ఆమె శిక్షణకు హాజరు కాలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ అనంతపురం నుంచి కర్నూలు జిల్లాకు రప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిండు గర్భిణి కావడంతో దూరప్రయాణం చేయడం వల్ల రక్తస్రావం జరిగి సుధారాణి కన్నుమూసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించాలని విజయసాయరెడ్డి డిమాండ్ చేశారు.

శ్రీచైతన్య విద్యాసంస్థ తమ ఉపాధ్యాయులకు నగర శివారులోని కట్టమంచి రెసిడెన్షియల్‌ స్కూల్‌లో శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో శిక్షణకు హాజరు కావాలని అనంతపురంలోని శ్రీచైతన్య స్కూలులో టీచర్ గా పనిచేస్తున్న సుధారాణికి సమాచారం అందించారు. అయితే తన ఆరోగ్యం సరిగ్గా లేదనీ, తాను రాలేనని ఆమె చెప్పినా పాఠశాల వర్గాలు ఒప్పుకోలేదు. హాజరుకావాల్సిందేనని పట్టుబట్టాయి.

దీంతో శిక్షణకు హాజరైన సుధారాణి సాయంత్రానికల్లా అస్వస్థతకు లోనయింది. వెంటనే రక్తస్రావం కావడంతో తోటి ఉద్యోగులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సుధారాణి ప్రాణాలు విడిచింది. సుధారాణికి భర్త, ఏడేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Andhra Pradesh
Telugudesam
YSRCP
Vijay Sai Reddy
sri chaitanya
murder case
Police
teacher
pregnent women dead
  • Loading...

More Telugu News