Andhra Pradesh: ఎన్నికల బరిలో విద్యావంతులు.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన వైసీపీ!

  • వైసీపీ అభ్యర్థుల్లో 88 శాతం డిగ్రీ హోల్డర్లు
  • రెండు, మూడు స్థానాల్లో డీఎంకే, అన్నాడీఎంకే
  • నాలుగో స్థానంలో నిలిచిన టీఆర్ఎస్

ఆంధ్రప్రదేశ్ లో గత నెల 11న అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ఇండియా టుడే గ్రూప్ 'డేటా ఇంటెలిజెన్స్ యూనిట్' ఆసక్తికరమైన సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు నిలబెట్టిన అభ్యర్థుల చదువు, అర్హతలను సర్వే చేసింది. ఇందుకోసం వారు సమర్పించిన అఫిడవిట్ పత్రాలను విశ్లేషించింది. ఇందులో ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి.

ఈ జాబితాలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్ నేతృత్వంలోని వైసీపీ దేశంలోనే తొలిస్థానంలో నిలిచినట్లు ఇండియా టుడే గ్రూపు తెలిపింది. వైసీపీ తరఫున లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో 88 శాతం మంది డిగ్రీ, లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్నారని చెప్పింది. ఈ జాబితాలో తమిళనాడుకు చెందిన డీఎంకే 87.5 శాతం డిగ్రీ హోల్డర్లతో రెండో స్థానంలో నిలవగా, అన్నాడీఎంకే 86.4 శాతంతో మూడోస్థానంలో నిలిచింది.

ఇక తెలంగాణలో అధికార టీఆర్ఎస్ 82.4 శాతం డిగ్రీ హోల్డర్లతో దేశవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచింది. అలాగే ఈ జాబితాలో నామ్ తమిళర్ కట్చి(80 శాతం), సీపీఎం(78 శాతం), కాంగ్రెస్(76 శాతం), తృణమూల్ కాంగ్రెస్(75 శాతం) బీజేపీ(71 శాతం) పార్టీలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఇక బరిలో ఉన్న అభ్యర్థులందరూ ఉన్నత విద్యను అభ్యసించిన లోక్ సభ నియోజకవర్గాల్లో శ్రీకాకుళం చోటు దక్కించుకుంది. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో ఈసారి 139 మంది నిరక్షరాస్యులు బరిలో ఉన్నట్లు ఇండియాటుడే  ఇంటెలిజెన్స్ యూనిట్ చెప్పింది.

  • Loading...

More Telugu News