kidney rocket: కిడ్నీ రాకెట్ కేసు: విశాఖ శ్రద్ధ ఆసుపత్రి హెచ్‌ఆర్ అడ్మినిస్ట్రేటర్ అరెస్టు
- ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న వైద్యుడు
- విచారణ ముమ్మరం చేసిన కమిటీ
- మొత్తం ఎనిమిదేళ్ల వ్యవహారాలపై ఆరా
విశాఖ నగరంలో సంచలనం రేపిన శ్రద్ధ ఆసుపత్రి కిడ్నీ మార్పిడి కేసుకు సంబంధించి ఆసుపత్రి హెచ్‌ఆర్ అడ్మినిస్ట్రేటర్ జె.కె.వర్మను పోలీసులు అరెస్టు చేశారు. ఆసుపత్రిలో నిబంధనలకు విరుద్ధంగా కిడ్నీ మార్పిడి జరుగుతున్నట్లు వెలుగు చూసిన విషయం తెలిసిందే.
ఓ దాత నుంచి ఏడాది క్రితం కిడ్నీ తీసుకుని ఇస్తామన్న డబ్బులు ఇవ్వక పోవడంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి వ్యవహారాల గుట్టు రట్టయింది. నిర్వాహకులు, దళారులు కలిసి ఎంత అడ్డగోలుగా వ్యవహారాలు నడుపుతున్నారన్నది బయట పడడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తిరుపతి రావు, డీసీహెచ్‌ఎస్ నాయక్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్‌తో కూడిన విచారణ కమిటీ పలు అంశాలపై ఆరాతీస్తోంది.
ఆసుపత్రిలో ఎనిమిదేళ్లుగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తుండగా ఇందుకోసం ఒకసారి ఆసుపత్రి యాజమాన్యం రెన్యువల్ కూడా చేసుకుంది. ఈ ఎనిమిదేళ్లలో ఎన్ని కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్లు జరిగాయి, అందులో బ్రెయిన్ డెడ్ కేసులెన్ని, ఎన్ని కుటుంబ సభ్యుల కేసులున్నాయి, ఆ వివరాలన్నీ డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి అందించారా, రోగి బంధువులు కాని వారెవరి నుంచైనా కిడ్నీలు సేకరించి మార్పిడి చేశారా? తదితర అంశాలపై ఈ కమిటీ ఆరాతీస్తోంది.
ఇప్పటికే ఆపరేషన్ చేసిన డాక్టర్‌ను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా హెచ్‌ఆర్ అడ్మినిస్ట్రేటర్‌ను అరెస్టు చేశారు. లోతుగా దర్యాప్తు పూర్తికాగానే యాజమాన్యంపైనా చర్యలు ఉంటాయని, ఎన్టీఆర్ వైద్య సేవల విభాగం నుంచి ఆసుపత్రిని తప్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు.