Danteshwari Fighters: ఓన్లీ లేడీస్... నక్సల్స్ పీచమణిచేందుకు రంగంలోకి దిగిన 'దంతేశ్వరి ఫైటర్స్'!
- కఠోర శిక్షణను పూర్తి చేసుకున్న 30 మంది మహిళలు
- నక్సల్స్ పై పోరులో ముందు నిలుస్తారంటున్న అధికారులు
- కీకారణ్యంలో పోరాడేందుకు అవసరమైన శిక్షణ
30 మంది మగువలు. అత్యంత కఠినమైన శిక్షణ ముగించుకుని అడవుల్లో కాలుమోపారు. వారి లక్ష్యం ఒక్కటే. నక్సలైట్లను ఏరివేయడం! ఇండియాలో తొలిసారిగా అందరూ మహిళలతో యాంటీ నక్సల్ కమాండో యూనిట్ ప్రారంభమైంది. చత్తీస్ గఢ్ లో నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉండే దంతెవాడ, బస్తర్ రీజియన్లలో పని చేయనున్న ఈ టీమ్ పేరు 'దంతేశ్వరి ఫైటర్స్'.
నక్సల్స్ పై పోరులో వీరు ముందుండి నిలుస్తారని, డిప్యూటీ ఎస్పీ దినేశ్వరీ నంద్ ఈ టీమ్ ను లీడ్ చేస్తారని ఉన్నతాధికారులు తెలిపారు. ఇక్కడున్న యాంటీ నక్సల్స్ టీమ్ లతో 'దంతేశ్వరి ఫైటర్స్' కలిసి పని చేస్తుందని, కీకారణ్యంలో పోరాడేందుకు అవసరమైన శిక్షణను వీరికిచ్చామని వెల్లడించారు. కాగా, గత సంవత్సరం యువతను భాగం చేస్తూ, 'బస్తారియా బెటాలియన్' పేరిట యువతీ యువకులతో కూడిన ఓ టీమ్ ను సీఆర్పీఎఫ్ తయారు చేసుకోగా, వారికి శిక్షణ పూర్తి కావొచ్చింది.
'దంతేశ్వరి ఫైటర్స్'లోని మహిళలకు ఈ ప్రాంతం గురించిన పూర్తి సమాచారం తెలుసునని, వీరందరినీ బస్టారియా బెటాలియన్ టీమ్ నుంచే ఎంపిక చేసుకున్నామని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ వెల్లడించారు.