Hyderabad: చేతులు వెనక్కి విరిచి పట్టుకున్న మామ...తలపై మోది చంపేసిన బావమరిది
- మాట్లాడుకుందాం రా... అని అల్లుడిని పిలిచి హత్య
- దంపతుల మధ్య విభేదాల నేపథ్యంలో అత్తింటి వారి ఘాతుకం
- హైదరాబాద్ చింతల్ డివిజన్‌లో ఘటన
దంపతుల మధ్య విభేదాల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత భర్తపై వేధింపుల కేసు పెట్టింది. ఈ నేపధ్యంలో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని అల్లుడిని పిలిచిన అత్తింటి వారు అక్కడే మట్టుపెట్టారు. హైదరాబాద్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.
చింతల్ డివిజన్ ఐడీపీఎల్ కాలనీకి చెందిన షేక్ అమీర్ (26), కైసర్‌నగర్‌కు చెందిన హీనాబేగంలు దంపతులు. ప్రేమించుకున్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నారు. వీరికి మూడు నెలల పాప ఉంది. ఆటో నడుపుతూ అమీర్ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండు వారాల క్రితం దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో మూడు నెలల పాపను ఇంట్లోనే వదిలేసి హీనాబేగం పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసి పాపను కూడా తీసుకువెళ్లిపోయింది.
ఈ వివాదం మొదలైనప్పటి నుంచి మాట్లాడుకుందాం రావాలంటూ అమీర్‌ను అత్తింటి వారు పిలుస్తూనే ఉన్నారు. భార్య, కుమార్తెను తనతో పంపిస్తామంటేనే వస్తానని అమీర్ స్పష్టం చేయడంతో అందుకు అంగీకరించారు. దీంతో శనివారం రాత్రి 9గంటల సమయంలో 12 ఏళ్ల తన మేనల్లుడితో కలిసి అత్తింటికి వెళ్లాడు.
అక్కడ కుమార్తెను ఎత్తుకుని సెల్ఫీ తీసుకుంటుండగా బావమరిది అభ్యంతరం చెప్పాడు. దీంతో గొడవ మొదలయ్యింది. వివాదం పెద్దది కావడంతో అమీర్ మామ మరూఫ్ జోక్యం చేసుకుని అల్లుడి రెండు చేతులు వెనక్కిలాగి పట్టుకోగా.. బావమరిది ఇస్మాయిల్ రాడ్డుతో తలపై బలంగా నాలుగుసార్లు మోదాడు. దీంతో అమీర్ మెదడు బయటకు వచ్చేసింది.
తీవ్రంగా గాయపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చి అపస్మారక స్థితిలో పడిపోయిన అమీర్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా దారి మధ్యలో చనిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతుని బావమరిది ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అత్తింటి వారు పథకం ప్రకారం పిలిచి చంపేశారా? లేక క్షణికావేశంలో హత్య జరిగిందా? అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.