Hyderabad: ఏపీ కానిస్టేబుల్‌ను బలవంతంగా విజయవాడ తరలించే ప్రయత్నం.. ఖైరతాబాద్ చౌరస్తాలో జీపు నుంచి దూకేసిన కానిస్టేబుల్!
- ఖైరతాబాద్ కూడలిలో కానిస్టేబుల్‌తో పోలీసుల గలాటా
- బలవంతంగా జీపులోకి ఎక్కించే ప్రయత్నం
- స్థానికుల జోక్యంతో వదిలేసిన పోలీసులు
హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఏపీ కానిస్టేబుల్‌ను విజయవాడ బదిలీ చేశారు. అయితే, అతను వెళ్లనని మారాం చేయడంతో బలవంతంగా జీపులో తరలిస్తుండగా ఖైరతాబాద్ చౌరస్తాలో జీపు నుంచి దూకి పరుగందుకున్నాడు. దీంతో విస్తుపోవడం వాహనదారుల వంతైంది. జీపు నుంచి దూకిన మధు అనే కానిస్టేబుల్‌ను నలుగురు పోలీసులు తిరిగి బలవంతంగా జీపులోకి ఎక్కిస్తుండగా, తనను వదిలేయాలంటూ అతడు ప్రాధేయపడ్డాడు.
దీంతో అతనికి, వారికీ మధ్య వాగ్వివాదం, పెనుగులాట జరిగాయి. ఇది చూసిన వాహనదారులు ఏమైంది? ఎందుకు అతడిని బలవంతంగా జీపులోకి ఎక్కిస్తున్నారు? అని ప్రశ్నిస్తూ మొబైల్‌లో వీడియో చిత్రీకరించడంతో ఎందుకొచ్చిన గొడవని భావించిన పోలీసులు అతడిని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇక, జీపు నుంచి దూకిన కానిస్టేబుల్ మధును ఏం జరిగిందని వాహనదారులు ప్రశ్నించారు. తాను ఏపీఎస్‌పీ 11వ బెటాలియన్ కానిస్టేబుల్‌నని చెప్పుకొచ్చాడు. తనను బలవంతంగా విజయవాడ తరలించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాడు. కాగా, స్థానికులు తాము తీసిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అది వైరల్ అవుతోంది.