Telangana: తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థులందరూ మెరిట్ స్టూడెంట్లే: అఖిలపక్షం

  • ముగిసిన అఖిలపక్ష సమావేశం
  • బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదు?
  • సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ డిమాండ్

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ఇవాళ హైదరాబాద్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ విపక్ష నేతలు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్రపతిని కలవాలని అఖిలపక్ష నేతలు నిర్ణయించుకున్నారు.

అంతేకాకుండా, ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల టెన్త్, ఇంటర్ ఫస్టియర్ మెమోలతో మానవ హక్కుల కమిషన్ ను కలవాలని తీర్మానించారు. ఈ క్రమంలో 15వ తేదీన విద్యార్థి, యువజన సంఘాల సమావేశం నిర్వహించాలని నిశ్చయించారు. ఈ సందర్భంగా సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. కేసీఆర్ కు విహార యాత్రలు చేయడానికి సమయం దొరుకుతుంది కానీ, అఖిలపక్షాన్ని కలిసేందుకు సమయంలేదని విమర్శించారు. ఇంటర్ మార్కుల్లో తీవ్ర గందరగోళానికి కారణమైన బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో చెప్పాలని నిలదీశారు.

ఇక, ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థులందరూ మెరిట్ స్టూడెంట్లేనని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించిన కార్యాచరణకు తమ పార్టీ మద్దతిస్తుందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. టీజేఎస్ చీఫ్ కోదండరాం మాట్లాడుతూ, విద్యార్థుల ఆత్మహత్యలపై సభ్యసమాజం కూడా స్పందించాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News