UK: బ్రిటన్ లో అత్యంత సంపన్నులుగా హిందూజా సోదరులు
- పోయిన స్థానం తిరిగి దక్కించుకున్న భారత సంతతి కుబేరులు
- గతేడాది కంటే 1.35 బిలియన్ పౌండ్ల ఆదాయం పెంపు
- జాబితా ప్రకటించిన సండే టైమ్స్
హిందూజా సోదరులుగా పేరుగాంచిన శ్రీచంద్, గోపీచంద్ హిందూజా మరోసారి బ్రిటన్ లో అత్యంత ధనవంతులుగా నిలిచారు. సండే టైమ్స్ 2019 సంపన్నుల జాబితాలో హిందూజాలు నంబర్ వన్ స్థానం దక్కించుకున్నారు. గతేడాది బ్రిటీష్ వ్యాపారవేత్త జిమ్ రాట్ క్లిఫ్ కు కోల్పోయిన అగ్రస్థానాన్ని హిందూజా బ్రదర్స్ మళ్లీ చేజిక్కించుకున్నారు. ఈ ఏడాది హిందూజా సోదరుల ఆస్తి విలువను సండే టైమ్స్ 22 బిలియన్ పౌండ్లుగా పేర్కొంది. గతేడాదితో పోల్చితే వారి ఆదాయం 1.35 బిలియన్ల మేర పెరిగింది.
హిందూజాల వ్యాపార సామ్రాజ్యం ప్రధానంగా చమురు, సహజవాయువు, ఐటీ, స్థిరాస్తి రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా విస్తరించుకుని ఉంది. కాగా, సండే టైమ్స్ జాబితాలో ద్వితీయస్థానంలో స్థిరాస్తి వ్యాపారులు డేవిడ్, సైమన్ రూబెన్ నిలిచారు. హిందూజా సోదరులు 2014, 2017 సంవత్సరాల్లో కూడా ఈ జాబితాలో అగ్రస్థానం అలంకరించారు. భారత సంతతికి చెందిన లార్డ్ స్వరాజ్ పాల్ కుటుంబం 2 బిలియన్ పౌండ్ల సంపదతో ఈ జాబితాలో 69వ స్థానంలో నిలిచింది.