Bihar: పదేళ్ల లోపు బాలలతో మండుటెండలో ఈవీఎంలను మోయించిన ఎన్నికల అధికారులు
- వివాదాస్పదమైన ఎన్నికల అధికారుల తీరు
- మండుటెండలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లు మోయించిన వైనం
- మండిపడుతున్న బాలల హక్కుల సంఘాలు
ఈవీఎంలను బాలకార్మికులతో మోయించిన ఎన్నికల అధికారుల తీరు వివాదాస్పదం అవుతోంది. బీహార్‌లో ఆరో దశ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఈవీఎంలు, వీవీప్యాట్లను తరలించేందుకు అధికారులు బాల కార్మికులను ఎంచుకున్నారు. నిండా పదేళ్లు లేని వారితో వాటిని మోయించారు. ఇదికాస్తా మీడియా కంటికి చిక్కడంతో విషయం వెలుగుచూసింది. చప్రాలోని జయప్రకాశ్ ఇంజినీరింగ్ కాలేజీ పరిసరాల్లో మీడియాకు ఈ దృశ్యాలు కనిపించాయి.
బాలకార్మికులతో మండుటెండలో ఎన్నికల సామగ్రిని మోయించిన విషయం వెలుగులోకి వచ్చి వివాదాస్పదమైంది. అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్ సామగ్రిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించి, పిల్లలతో వాటిని మోయించడంపై బాలల హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. దీంతో స్పందించిన అధికారులు ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపడేశారు.