Priyanka Gandhi: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి కోసం ప్రియాంక గాంధీ ఆరాటం

  • నేతలతో చెప్పి చార్టర్డ్ విమానం ఏర్పాటు
  • పాప ఢిల్లీ తరలింపు
  • ఎయిమ్స్ లో చికిత్స

కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన సహృదయాన్ని చాటుకున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ చిన్నారి ట్యూమర్ తో బాధపడుతూ వైద్యానికి కూడా డబ్బులేని స్థితిలో వుందని తెలిసి, ప్రియాంక సత్వరమే స్పందించి, కాంగ్రెస్ నాయకులను అప్రమత్తం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తమ కుమార్తెకు వైద్యం చేయించలేకున్నామని, ఆమె ట్యూమర్ తో బాధపడుతోందంటూ యూపీలో నిరుపేద తల్లిదండ్రులు ప్రియాంకకు మొరపెట్టుకున్నారు.

ఓవైపు జాతీయ స్థాయిలో తీవ్రమైన ఎన్నికల ఒత్తిడి నెలకొని ఉన్నా, ప్రియాంక పెద్ద మనసుతో వాళ్ల కోసం సమయం కేటాయించారు. వారి పరిస్థితి మొత్తం విని చలించిపోయారు. వెంటనే పార్టీ నాయకులైన రాజీవ్ శుక్లా, మహ్మద్ అజహరుద్దీన్, హార్దిక్ పటేల్ లను అప్రమత్తం చేశారు. ఆ పాపకు అవసరమైన వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ప్రియాంక ఓ చిన్నారి పాప కోసం పడుతున్న ఆరాటం చూసిన ఆ నాయకులు కూడా వెంటనే స్పందించి ఢిల్లీ వెళ్లేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. ఓ చార్టర్ ప్లేన్ లో ఆ పాపను, ఆమె తల్లిదండ్రులను ఢిల్లీ తీసుకెళ్లి ఎయిమ్స్ లో చేర్చారు. ఆ పాపకు వైద్యం అందే తీరును ప్రియాంక ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నేతలకు సూచనలు అందజేస్తున్నట్టు కాంగ్రెస్ నాయకుడు జితేంద్ర తివారీ తెలిపారు. కాగా, పాపను ఢిల్లీ తరలించిన విమానంలో అజహరుద్దీన్, హార్దిక్ పటేల్ వంటి నాయకులు ఉండడం ఆ పాప పట్ల ప్రియాంక చూపిస్తున్న శ్రద్ధకు నిదర్శనం అని చెప్పాలి.

  • Loading...

More Telugu News