JP: ఎంతో సులభంగా జరగాల్సిన ఎన్నికలకు గందరగోళం సృష్టిస్తున్నారు: లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ
- విశాఖపట్నంలో చర్చా కార్యక్రమం
- మూడు నెలల పాటు ఎన్నికలంటే అభివృద్ధికి విఘాతం
- కెన్యా లాంటి చిన్నదేశాలను చూసి నేర్చుకోవాలి
దేశంలో ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులపై లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతో సులువుగా జరగాల్సిన ఎన్నికలను లక్షలమంది సైన్యం ఉంటే తప్ప జరగవన్నట్టుగా గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై విశాఖపట్నంలో లోక్ సత్తా ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో మూడు నెలల పాటు ఎన్నికలు నిర్వహించడం కారణంగా అభివృద్ధి ఆగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నిరోజుల పాటు కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉండడం వల్ల అనేక అభివృద్థి కార్యక్రమాలకు విఘాతం ఏర్పడుతోందని అన్నారు. పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ప్రభుత్వాలు ఇక ఏమీ చేయడానికి లేదు అనే పరిస్థితి కనిపిస్తోందని జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించారు. ఇది చాలా హాస్యాస్పదమైన పరిస్థితి అని పేర్కొన్నారు.
ఇతర దేశాల్లో ఏం జరుగుతుందో మనం చూడడంలేదని అన్నారు. మనదే గొప్ప ప్రజాస్వామ్యం అనుకోకూడదని పార్టీలకు ఆయన చురక అంటించారు. కెన్యాలాంటి చిన్న దేశాల నుంచి కూడా మనం ఎంతో నేర్చుకోవాలని, మనమే గొప్ప అనుకోరాదని హితవు పలికారు. ఎలాగోలా భారత్ లో ప్రజాస్వామ్యం నడుస్తుండడం సంతోషపడాల్సిన విషయమే అయినా, అదెంతా లోపభూయిష్టంగా ఉందన్న సంగతి ఆందోళనకరం అని జేపీ పేర్కొన్నారు.
"కెన్యాలో ఇంతకంటే మెరుగైన రీతిలో ఎన్నికలు నిర్వహించారు. అక్కడ 27 ఏళ్ల నియంతృత్వం తర్వాత ఎన్నికలు జరిగాయి. నేనా సమయంలో కామన్వెల్త్ బృందం తరఫున పర్యవేక్షకుడిగా ఉన్నాను. రాష్ట్రపతి ఎన్నిక, పార్లమెంటు ఎన్నిక, అన్ని స్థానిక ప్రభుత్వాల ఎన్నిక అన్నీ ఒక్కరోజులో జరిగిపోయాయి. ఆ రాత్రికే ఫలితాలు కూడా వెల్లడించారు" అంటూ తన ఆలోచనలు పంచుకున్నారు.