Nara Lokesh: ఐటీసీ చైర్మన్ దేవేశ్వర్ మృతికి నారా లోకేశ్ సంతాపం
- దేవేశ్వర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన లోకేశ్
- ట్విట్టర్ లో స్పందన
- అనారోగ్య కారణాలతో మృతి చెందిన దేవేశ్వర్
ఐటీసీ చైర్మన్, పద్మభూషణ్ గ్రహీత వైసీ దేవేశ్వర్ మృతికి ఏపీ మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలియజేశారు. ఆయన మృతి వార్త తనను ఎంతో విచారానికి గురిచేసిందని పేర్కొన్నారు. ఎవరికీ సాధ్యం కాని నాయకత్వ లక్షణాలు, వ్యాపార దక్షత ఉన్న నిజమైన మార్గదర్శకుడు దేవేశ్వర్ అని నారా లోకేశ్ కీర్తించారు. ఇలాంటి విషాద సమయంలో ఆయన కుటుంబానికి, బంధుమిత్రులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు లోకేశ్ ట్వీట్ చేశారు.
కాగా, 72 ఏళ్ల దేవేశ్వర్ ఈ ఉదయం అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భారత కార్పొరేట్ కంపెనీల చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలం ఓ కంపెనీకి చైర్మన్ గా వ్యవహరించిన ఘనత దేవేశ్వర్ సొంతం. 1968లో ఐటీసీలో చేరిన ఆయన 1996 నాటికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయ్యారు. అంచెలంచెలుగా ఎదుగుతూ చైర్మన్ గా సంస్థను అభివృద్ధి పథంలో నడిపించారు.