Rahul Gandhi: రేపు ఆరెస్సెస్ సభ్యులపై దాడి జరిగినా అండగా నిలబడతాం!: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ
- మా పోరాటం విద్వేష భావజాలంతోనే
- ప్రేమ కారణంగానే భారత్ పురోగతి
- ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్నివర్గాలను, అసమ్మతి గొంతుకలను గౌరవిస్తామని ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ తెలిపారు. భిన్నమైన అభిప్రాయాలు, అసమ్మతి వ్యక్తం చేసే గొంతుకలను అణచివేయబోమని స్పష్టం చేశారు. ఓ లైన్ లో నిలబడ్డ చివరి వ్యక్తికి కూడా న్యాయం అందాలని గాంధీజీ చెప్పేవారనీ, దాన్ని తాము పాటిస్తామని రాహుల్ అన్నారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాహుల్ ఈ మేరకు స్పందించారు.
దేశంలోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) సభ్యులకు వ్యతిరేకంగా హింస చెలరేగినా, అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తాము విద్వేష భావజాలం, సిద్ధాంతాలకు వ్యతిరేకంగానే పోరాడుతున్నామనీ, వ్యక్తులకు వ్యతిరేకంగా కాదని తేల్చిచెప్పారు. భారత్ ప్రేమతో కూడుకున్న దేశమనీ, ప్రేమ కారణంగానే దేశం పురోగమించగలిగిందని వ్యాఖ్యానించారు.