New Delhi: కేజ్రీవాల్ రూ.6 కోట్లు తీసుకుని మా నాన్నకు టికెట్ ఇచ్చారు: ఆప్ నేత కుమారుడి ఆరోపణ
- బల్బీర్ సింగ్ కు పశ్చిమ ఢిల్లీ టికెట్ కేటాయింపు
- కేజ్రీవాల్ రూ.6 కోట్లు తీసుకున్నారన్న సింగ్ కుమారుడు ఉదయ్
- ఆప్ కు ఓటేయవద్దని ప్రజలకు విన్నపం
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై సొంత పార్టీ నేత కుమారుడు సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ఏకంగా రూ.6 కోట్ల నగదు పుచ్చుకుని తన తండ్రికి లోక్ సభ టికెట్ ఇచ్చారని విమర్శించారు. ఈరోజు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటుచేసిన ఉదయ్.. తన తండ్రి బల్బీర్ సింగ్ 3 నెలల క్రితం రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. పార్టీ టికెట్ కావాలంటే రూ.6 కోట్లు ఇవ్వాల్సిందిగా అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారన్నారు.
ఇందుకు అంగీకరించిన తన తండ్రి, కేజ్రీవాల్ కోరిన రూ.6 కోట్లను ఇచ్చి, పశ్చిమ ఢిల్లీ టికెట్ దక్కించుకున్నారని అన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి తన వద్ద పక్కా సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. ఈ నగదును కేజ్రీవాల్ తో పాటు ఆప్ నేత గోపాల్ రాయ్ అందుకున్నారని ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన ఆప్ కు ఈసారి ఓటేయకుండా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.