Apache: భారత వాయుసేన అమ్ములపొదిలో తిరుగులేని అస్త్రం 'అపాచీ'
- తొలి హెలికాప్టర్ ను భారత్ కు అప్పగించిన అమెరికా
- 22 హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు అగ్రరాజ్యంతో ఒప్పందం
- ఎలాంటి వాతావరణంలోనైనా దాడి చేయగల సామర్థ్యం అపాచీ సొంతం
భారత వాయుసేన అమ్ములపొదిలో ఓ కీలక అస్త్రం చేరింది. అగ్రరాజ్యం అమెరికాకు ఎన్నో ఏళ్లుగా విశిష్టరీతిలో సేవలు అందిస్తున్న అపాచీ అటాకింగ్ హెలికాప్టర్లు ఇకపై భారత్ వాయుసేనలో కూడా తమ ప్రాభవాన్ని చాటనున్నాయి. 2015లో అమెరికా, భారత్ మధ్య 22 అపాచీ హెలికాప్టర్ల విక్రయానికి ఒప్పందం కుదరగా, శుక్రవారం భారత్ కు తొలి అపాచీ గార్డియన్ అటాక్ హెలికాప్టర్ ను అప్పగించారు. ఆరిజోనాలోని బోయింగ్ సంస్థ ఉత్పత్తి కేంద్రంలో ఈ అపాచీ హెలికాప్టర్ ను ఎయిర్ మార్షల్ ఏఎస్ బుటోలాకు అందజేశారు. ఈ మేరకు భారత వాయుసేన ట్వీట్ చేసింది.
అపాచీ హెలికాప్టర్లు ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థులపై దాడులు చేయగలవు. గగనతలం, భూతలం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోగల సత్తా అపాచీ హెలికాప్టర్లకు ఉంది. ఒక్కసారి యుద్ధరంగంలో దిగిన తర్వాత అందుబాటులో ఉన్న డేటా నెట్వర్కింగ్ వ్యవస్థల నుంచే కాకుండా, ఇతర ఆయుధ వ్యవస్థల నుంచి కూడా స్వయంగా సమాచారం సేకరించడం, ఇతర వ్యవస్థలకు చేరవేయడం అపాచీ హెలికాప్టర్లకు మాత్రమే ఉండే ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం.
చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ రాడార్లను బోల్తా కొట్టించే స్టెల్త్ పరిజ్ఞానాన్ని ఈ హెలికాప్టర్లలో పొందుపరిచారు. తక్కువ ఎత్తులో ప్రయాణించేటప్పుడు చెట్లకు, రాళ్ల గుట్టలకు తగలకుండా ఉండే విధంగా దీని రూపురేఖలు డిజైన్ చేశారు.