TV9: ఇక రవిప్రకాశ్ కు టీవీ9తో ఎలాంటి సంబంధంలేదు.. మే 8నే అతడ్ని తొలగించాం: ఏబీసీఎల్ బోర్డు స్పష్టీకరణ

  • ప్రెస్ మీట్ పెట్టిన బోర్డు డైరక్టర్లు
  • యాజమాన్య బదిలీలో రవిప్రకాశ్, మూర్తి అడ్డుపడ్డారు
  • చానల్ సిబ్బంది ఈ మార్పును ఎంతో సంతోషంగా స్వీకరించారు

ప్రముఖ తెలుగు న్యూస్ చానల్ టీవీ9 వ్యవహారంలో మరింత స్పష్టత ఇచ్చేందుకు చానల్ బోర్డు డైరక్టర్లు ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. బోర్డు డైరక్టర్లలో ఒకరైన సాంబశివరావు మీడియాకు వివరాలు వెల్లడించారు.

"అలంద మీడియా తొమ్మిది నెలల క్రితం ఏబీసీఎల్ లో 90.5 శాతం షేర్లను కొనుగోలు చేసింది. అయితే చానల్ ను పూర్తిగా మా అధీనంలోకి తీసుకోవడానికి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి.  చానల్ కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా, అక్కడి నుంచి మార్చిలో అనుమతులు వచ్చాయి. బోర్డు మీటింగ్ లు నిర్వహించాలని రవిప్రకాశ్ ను, మూర్తిని కోరితే న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయంటూ వాళ్లు తీవ్ర జాప్యం చేశారు.

వాళ్లకు తప్పుడు ఆలోచనలు ఉన్నట్టు తెలిసింది. వాళ్లకు 8 శాతం షేర్లు ఉన్నా 90.5 శాతం షేర్లు ఉన్న మమ్మల్ని అడ్డుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. దురుద్దేశాలతో వాళ్లే మేనేజ్ మెంట్ ను నియంత్రణలోకి తీసుకోవాలని భావించారు. కానీ వెంటనే చానల్ మేనేజ్ మెంట్ ను తమ అధీనంలోకి తీసుకోకపోతే ఏబీసీఎల్ కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని భావించాం.

ఈ క్రమంలో మే 8న బోర్డు డైరక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసి రవిప్రకాశ్ ను సీఈవోగా, మూర్తిని సీఎఫ్ఓగా తొలగించాం. అనంతరం చానల్ హెడ్స్, ఇతర సిబ్బందితో సమావేశమయ్యాం. వాళ్లు కూడా ఎంతో సంతోషంగా మమ్మల్ని స్వాగతించారు. వారికి ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తామని హామీ ఇచ్చాం. చానల్ కార్యకలాపాలకు ఇబ్బంది కలగకూడదనే టీవీ9 కన్నడ హెడ్ మహేంద్ర మిశ్రాను సీఈఓగా నియమించాం. సీఎఫ్ఓగా గొట్టిపాటి సింగారావును అపాయింట్ చేశాం.

ఇక నుంచి టీవీ9తో రవిప్రకాశ్ కు, మూర్తికి ఎలాంటి సంబంధం లేదు. మా చానల్ తో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు, వ్యక్తులు రవిప్రకాశ్, మూర్తిలతో మా కంపెనీ వ్యవహారాలు పంచుకోవాల్సిన పనిలేదు" అని స్పష్టం చేశారు.

TV9
  • Loading...

More Telugu News