sikh: పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ విధానాలకు నిదర్శనం: అరుణ్ జైట్లీ

  • పిట్రోడాను పార్టీ నుంచి రాహుల్ తొలగిస్తారా?
  • సిక్కుల ఊచకోతపై కాంగ్రెస్ కు పశ్చాత్తాపం లేదు
  • ఇది ఆ పార్టీకి సిగ్గుచేటు

నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేత శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ దీనిపై స్పందించారు. 1984 లో సిక్కుల ఊచకోతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పిట్రోడాను పార్టీ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ వెంటనే తొలగిస్తారా? అని ప్రశ్నించారు. సిక్కుల ఊచకోతకు సంబంధించి జరిగిందేదో జరిగిపోయిందంటూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ విధానాలకు నిదర్శనమని విమర్శించారు.

సిక్కుల ఊచకోత ఘటనపై ‘కాంగ్రెస్’ ఏమాత్రం పశ్చాత్తాపపడటం లేదన్న విషయం స్పష్టమవుతోందని, ఇది ఆ పార్టీకి సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాలకు సిక్కుల ఊచకోత ఒక ఉదాహరణ అని, ప్రతి ఒక్కరికీ వీటి గురించి తెలియాల్సిన అవసరముందని అన్నారు.  

ఇదిలా ఉండగా, తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తోందని శ్యామ్ పిట్రోడా ఆరోపించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన మాటల్లో కొన్నింటిని మాత్రమే అదేపనిగా ప్రస్తావిస్తున్నారని విమర్శించారు. నాటి ఘటనపై తాను విచారం వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News