Telugudesam: టీడీపీతో పెట్టుకున్నప్పుడే మోదీ పతనం ప్రారంభమైంది: సీఎం చంద్రబాబు
- దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకశక్తులను కూడగట్టాం
- మోదీ వ్యతిరేక గాలిని దేశ వ్యాప్తంగా ఉద్ధృతం చేశాం
- దేశానికి రాబోయేది కొత్త ప్రధానే
టీడీపీతో పెట్టుకున్నప్పుడే మోదీ పతనం ప్రారంభమైందని తమ పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు సమాచారం. మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్ లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన టీడీపీ నేతలతో ఆయన సమీక్షలు నిర్వహించారు. రాష్ట్రం కోసం, ఐదు కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసమే మోదీతో విభేదించామని చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను ఆయన అమలు చేయలేదని విమర్శించారు. అన్ని పార్టీలను ఏకం చేసి వ్యవస్థలను నిలబెట్టేందుకే పోరాడామని, సీబీఐ, ఆర్బీఐ స్వయం ప్రతిపత్తికి తూట్లు పొడిచారని, ఈడీ, ఐటీని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారని మోదీపై చంద్రబాబు విరుచుకుపడ్డారని పార్టీ నేతల సమాచారం.
దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకశక్తులను కూడగట్టామని, ఆ పార్టీకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయగలిగామని, మోదీ వ్యతిరేక గాలిని దేశ వ్యాప్తంగా ఉద్ధృతం చేశామని బాబు వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఓటమిపాలు అవుతామన్న బాధతోనే మోదీ చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని, అసహనంతో దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డట్లు సమాచారం. ఎప్పుడో చనిపోయిన రాజీవ్ గాంధీ గురించి మోదీ ప్రస్తావించడంపై బాబు విమర్శించారని తెలుస్తోంది. గత ఐదేళ్లలో మోదీ ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ వల్ల భారత రాజకీయాల్లో హుందాతనం కొరవడిందని, దేశానికి రాబోయేది కొత్త ప్రధానే అని పార్టీ నేతలతో చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు సమాచారం.