Telangana: యాదాద్రి జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం.. ఒంటరి మహిళపై అత్యాచారం, హత్య!

  • యాదాద్రి జిల్లాలోని వెంకటపురంలో ఘటన
  • బెల్టు షాపును నిర్వహిస్తున్న అనురాధ
  • అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి దారుణం

తెలంగాణలో కొందరు దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం కిరాతకంగా హత్య చేసి నగలు తీసుకుని ఉడాయించారు. యాదాద్రి జిల్లాలో నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం, జిల్లాలోని తుర్కపల్లి మండలం వెంకటపురంలో అనురాధ అనే మహిళ బెల్టు షాపును నిర్వహిస్తోంది. అనురాధ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన దుండగులు దొంగతనం చేయాలని నిర్ణయించారు. నిన్న అర్ధరాత్రి దాటాక తలుపు తట్టారు. మద్యం కావాలని కోరారు. దీంతో కస్టమర్లు అనుకుని తలుపు తీయగానే బలవంతంగా ఇంటిలోకి దూసుకొచ్చారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఇంట్లోని బంగారం, నగలు తీసుకుని పరారయ్యారు.

అనురాధ ఈరోజు ఇంటి నుంచి బయటకు రాకపోవడం, తలుపులు తెరిచి ఉండటంతో స్థానికులు లోపలకు వెళ్లగా, ఆమె అచేతనంగా మంచంపై పడిపోయి ఉంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. అనురాధపై అత్యాచారం చేసిన దుండగులు అనంతరం హత్య చేసినట్లు భావిస్తున్నామని చెప్పారు. 

Telangana
Yadadri Bhuvanagiri District
rape and murder
Police
  • Loading...

More Telugu News