Narendra Modi: ఈసీ తీరు దారుణం.. ప్రధాని మోదీకి వరుస క్లీన్‌చిట్లపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్

  • పిటిషన్‌ దాఖలు చేసిన పార్టీ ఎంపీ సుష్మితాదేవ్‌
  • విద్వేష పూరిత ప్రసంగాలను గుర్తించడంలో ఈసీ విఫలమని ఆరోపణ
  • భ్రష్టాచారి వ్యాఖ్యలపైనా తాజాగా క్లీన్‌చిట్‌

ప్రధాని మోదీ విద్వేషపూరిత ప్రసంగాలతో వరుసగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నా కేంద్ర ఎన్నికల సంఘం దాన్ని గుర్తించడంలో విఫలమవుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీపై ‘భ్రష్టాచారీ నంబర్‌ వన్‌’ అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఎన్నికల సంఘం క్లీన్‌ చిట్‌ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ రాహుల్‌ గాంధీనుద్దేశించి మాట్లాడుతూ ‘మీ నాన్న రాజీవ్‌ గాంధీ మిస్టర్‌ క్లీన్‌ అని ఆయన సన్నిహితులు పొగిడారు. కానీ ఆయన జీవితం భ్రష్టాచారీ వన్‌ (అవినీతిపరుడు)గా ముగిసింది’ అంటూ విమర్శించారు.

ఈ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధం అంటూ కాంగ్రెస్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం ‘కాంగ్రెస్‌ ఫిర్యాదు మేరకు మోదీ ప్రసంగ వీడియోలు తెప్పించి చూశాం. ఆయన ఎక్కడా కోడ్‌ ఉల్లంఘించినట్లు కనిపించ లేదు’ అంటూ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఇటీవల పలుమార్లు మోదీ ప్రసంగాలపై ఈసీ క్లీన్‌చిట్లు ఇస్తుండడాన్ని ఎద్దేవా చేస్తూ కాంగ్రెస్‌ ఎంపీ సుష్మితాదేవ్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది.

  • Loading...

More Telugu News