chattisgargh: కంచుకోటలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. ఇద్దరిని కాల్చిచంపిన భద్రతాబలగాలు!
- ఛత్తీస్ గఢ్ లోని సుక్మా-దంతేవాడ ప్రాంతంలో ఘటన
- నిఘావర్గాల సమాచారంతో కూంబింగ్ నిర్వహణ
- భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
ఛత్తీస్ గఢ్ లోని మావోల కంచుకోటగా పేరుగాంచిన దంతేవాడ, సుక్మా జిల్లాల సరిహద్దులో ఈరోజు భీకర ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. అక్కడి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు నక్కినట్లు భద్రతాబలగాలకు సమాచారం అందింది. దీంతో పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్త బలగాలు కూంబింగ్ చేపట్టాయి.
అరన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో బలగాల కదలికలను పసిగట్టిన మావోయిస్టులు ఒక్కసారిగా తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్టు చెందినట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదన్నారు.
ఎన్ కౌంటర్ జరిగిన చోటు నుంచి ఇన్సాఫ్ తుపాకి, పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. తప్పించుకున్న మావోల కోసం గాలింపును ముమ్మరం చేశామని పేర్కొన్నారు.