Uttar Pradesh: ఐదు నెలలుగా కనిపించకుండా పోయిన కానిస్టేబుల్.. విషయం తెలిసి నోరెళ్లబెట్టిన పోలీసులు!
- నెల రోజుల సెలవుపై సొంతూరికి వెళ్లిన కానిస్టేబుల్
- ఐదు నెలలైనా విధుల్లో చేరకపోవడంతో సస్పెండ్ చేసిన ఎస్పీ
- విచారణలో బయటపడిన విస్తుపోయే నిజం
ఐదు నెలలుగా కనిపించకుండా పోయిన పోలీస్ కానిస్టేబుల్ ఎక్కడున్నాడో తెలిసిన ఉన్నతాధికారులు అవాక్కయ్యారు. గత ఏడాది నవంబరులో నెల రోజుల సెలవుపై వెళ్లిన కానిస్టేబుల్ ప్రస్తుతం తీహార్ సెంట్రల్ జైలులో జీవిత శిక్ష అనుభవిస్తున్నట్టు తెలిసి ఆశ్చర్యపోయారు. 1987లో జరిగిన హషీంపురా ఊచకోత కేసులో దోషిగా తేలి జీవిత శిక్ష అనుభవిస్తున్నట్టు తెలియడంతో నోరెళ్లబెట్టారు.
55 ఏళ్ల కన్వర్ పాల్ సింగ్ బిజ్నోర్‌లోని బాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. గతేడాది నవంబరు 15న నెల రోజులు సెలవు పెట్టాడు. ఈ సందర్భంగా సొంతూరు షామ్లి వెళ్తున్నట్టు చెప్పాడు. అయితే, సింగ్ యూపీ ప్రావిన్షియల్ ఆర్మ్‌డ్ మాజీ కానిస్టేబుల్ అని ఎవరికీ తెలియకపోవడం గమనార్హం.
మే 22, 1987లో మీరట్‌లోని హషీంపురా ప్రాంతంలో 42 మంది ముస్లింలను కాల్చి చంపారు. అనంతరం మృతదేహాలను మీరట్‌లోని ఓ కాలువలోకి విసిరేశారు. ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు గతేడాది అక్టోబరు 31న 15 మందిని దోషులుగా తేల్చి జీవిత శిక్ష విధించింది. వీరిలో కన్వర్ పాల్ సింగ్ కూడా ఉన్నాడు. విషయం తెలిసిన కానిస్టేబుల్ సింగ్ లొంగిపోయాడు. దీంతో అతడిని తీహార్ జైలుకు తరలించారు.
నెల రోజుల సెలవుపై సొంతూరికి వెళ్లిన కన్వర్ సింగ్ మూడున్నర నెలలు అవుతున్నా తిరిగి విధుల్లోకి చేరకపోవడంతో ఏప్రిల్ 1న అతడిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. అతడు ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు డిపార్ట్‌మెంట్ విచారణకు ఆదేశించారు. విచారణ ప్రారంభించిన అధికారులు అతడు తీహార్ జైలులో జీవిత శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసి విస్తుపోయారు.