YSRCP: సర్వీస్ నిబంధనలపై విజయసాయిరెడ్డికి కనీస అవగాహన కూడా లేదు!: ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం
- ప్రజల్ని తప్పుతోవ పట్టించేందుకు విమర్శలు
- పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ గురించి తెలియక పోవడం దారుణం
- ఆయన తప్పుడు వ్యాఖ్యలపై పరువు నష్టం దావా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి పోలీసుల సర్వీస్ నిబంధనలపై కనీస అవగాహన లేదని ఆయన వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ, రాష్ట్ర ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు మండిపడ్డారు. ఉండవల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
పోలీసుల పదోన్నతుల్లో ఒకే సామాజిక వర్గానికి అవకాశం కల్పించి ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఆయన ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన తప్పుడు వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేయనున్నట్లు హెచ్చరించారు. రాజ్యాంగం ప్రకారం పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు 17 శాతం స్థానాలు కేటాయిస్తారన్న కనీస అవగాహన కూడా లేకుండా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలపై త్వరలోనే కేసు వేయనున్నట్లు స్పష్టం చేశారు.