Supreme Court: రంజన్ గొగోయ్ కి క్లీన్ చిట్ ఇవ్వడంపై మండిపడుతున్న మహిళా సంఘాలు... సుప్రీం కోర్టు వద్ద 144 సెక్షన్
- అంతర్గత కమిటీ విచారణలో పారదర్శకత లేదన్న మహిళా సంఘాలు
- కమిటీ నివేదికను ఫిర్యాదుదారుకు కూడా ఇవ్వాలంటూ డిమాండ్
- నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
కొన్నిరోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా, సుప్రీం అంతర్గత విచారణ కమిటీ ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొనడం తెలిసిందే. సుప్రీం నియమించిన ఆ కమిటీ జస్టిస్ రంజన్ గొగోయ్ కి క్లీన్ చిట్ ఇవ్వడంపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి.
అంతర్గత కమిటీ విచారణలో పారదర్శకత లోపించిందంటూ మహిళల హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు సుప్రీం కోర్టు ఎదుట ఆందోళనకు దిగారు. కమిటీ నివేదికను ఫిర్యాదు చేసిన మహిళకు కూడా అందించాలని డిమాండ్ చేశారు. కమిటీ విచారణ జరిపిన తీరు ఆమోదయోగ్యం కాదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి పెద్ద సంఖ్యలో నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు వద్ద 144 సెక్షన్ విధించారు.