Andhra Pradesh: వెనక్కు తగ్గేదే లేదు.. సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ సీఎం చంద్రబాబు!
- విపక్షాల రివ్యూ పిటిషన్ కొట్టివేత
- ఎన్నికలలో పారదర్శకత కావాలన్న చంద్రబాబు
- ఈవీఎంలపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్య
సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లను కనీసం 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాలన్న విపక్షాల రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈరోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసమే తాము పోరాడుతున్నామని తెలిపారు.
ప్రస్తుతం ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. పోలింగ్‌తోపాటు ఓట్ల లెక్కింపులోనూ పారదర్శకత రావాలని అభిప్రాయపడ్డారు. 'మాది న్యాయమైన డిమాండ్. గతంలో బ్యాలెట్ విధానంలో 24 గంటల్లోనే ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యేది. కానీ ఇప్పుడు వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడానికి 6 రోజుల సమయం కావాలని ఈసీ చెబుతోంది.
ఇక్కడ సమయం కంటే పారదర్శకత ముఖ్యం. ఈ విషయంలో మాతో పాటు 21 పార్టీల నేతలు ఈసీని మరోసారి కలుస్తారు’ అని చంద్రబాబు చెప్పారు. ఈవీఎం, వీవీ ప్యాట్లలో ఓట్ల మధ్య తేడా ఉంటే సంబంధిత నియోజకవర్గంలో మొత్తం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.