Andhra Pradesh: ఇనిమెట్లలో అందుకే నాపై దాడి జరిగింది!: ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు

  • ఏపీ అసెంబ్లీ సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించాం
  • రాష్ట్ర విభజనలో బీజేపీ, కాంగ్రెస్ సమానపాత్ర
  • అమరావతిలో మీడియాతో టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను సమర్థవంతంగా, ఫలప్రదంగా నిర్వహించగలిగామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. రాష్ట్రం విడిపోయిన ఐదేళ్ల తర్వాత ఏపీ, తెలంగాణలపై ప్రధాని మోదీ బిహార్ లో చేసిన వ్యాఖ్యలు సరికావని అభిప్రాయపడ్డారు. ఏపీ విభజన విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు సమానపాత్ర ఉందని ఆయన విమర్శించారు. ఏపీని విభజించింది కాంగ్రెస్ అయితే, దానికి బీజేపీ సహకరించిందని కోడెల విమర్శించారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ విభజన వద్దని ఆనాడు బీజేపీ చెప్పి ఉంటే అసలు రాష్ట్రం విడిపోయేదే కాదని కోడెల స్పష్టం చేశారు. పక్కవారిపై నెపాన్ని నెట్టివేసి విభజన హామీల అమలు నుంచి మోదీ, బీజేపీ తప్పించుకోలేవని తేల్చిచెప్పారు. తెలుగు ప్రజలను అవమానించేలా ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు.

ఒడిశాను పెను తుపాను ఫణి తాకితే రూ.1,000 కోట్లు ఇచ్చిన మోదీ, తిత్లీ తుపాను గురించి కనీసం మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నుంచి ఈ సీజన్ లో నీళ్లు ఇవ్వలేకపోవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని కోడెల ఆరోపించారు.

ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలోని ఇనిమెట్లలో తనపై జరిగిన దాడి విషయంలో కోడెల శివప్రసాదరావు స్పందించారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా తగినన్ని బలగాలు రాలేదని ఏపీ సీఈవో ద్వివేదీ చెప్పారనీ, అందువల్లే తనపై దాడి జరిగిందని కోడెల చెప్పారు.

  • Loading...

More Telugu News