ashok chavan: ఈవీఎంలు ట్యాంపర్ చేస్తారు.. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద జామర్లను ఏర్పాటు చేయండి: అశోక్ చవాన్
- వైర్ లెస్ నెట్ వర్కులతో ఈవీఎంలు ట్యాంపర్ చేస్తారు
- కౌంటింగ్ సందర్భంగా కూడా జామర్లు ఉండాలి
- 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాల్సిందే
ఈవీఎంలను భద్రపరుస్తున్న స్టాంగ్ రూమ్ ల వద్ద జామర్లను ఏర్పాటు చేయాలని ఎలక్షన్ కమిషన్ ను మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిని కలసి ఆయన ఈ మేరకు విన్నవించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వైర్ లెస్ నెట్ వర్కులు అయిన మొబైల్ ఫోన్ టవర్లు, వైఫై నెట్ వర్కులతో ఈవీఎంలను హ్యాకర్లు ట్యాంపర్ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఈవీఎంలు ట్యాంపర్ కాకుండా ఉండాలంటే జామర్లను ఏర్పాటు చేయడమే పరిష్కారమని తెలిపారు. కౌంటింగ్ సందర్భంగా కూడా జామర్లు ఉండాలని డిమాండ్ చేశారు. అన్ని లోక్ సభ నియోజకవర్గాల్లో వెంటనే జామర్లను ఏర్పాటు చేయాలని అన్నారు.
కౌంటింగ్ సందర్భంగా ప్రతి రౌండ్ ఫలితాలను రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ధారించుకుని, సంతకం చేసిన తర్వాతే ప్రకటించాలని ఎన్నికల సంఘానికి చెప్పామని చవాన్ తెలిపారు. ఫస్ట్ రౌండ్ ప్రాసెస్ మొత్తం పూర్తయిన తర్వాతే తదుపరి రౌండ్ కౌంటింగ్ ను ప్రారంభించాలని చెప్పారు. అనుమానాలు ఉన్న పక్షంలో రౌండ్ ల వారీగా రీకౌంటింగ్ చేసే వెసులుబాటును పోల్ ప్యానల్ పరిగణించాలని అన్నారు. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలనే తమ డిమాండ్ కు కట్టుబడి ఉన్నామని చెప్పారు. అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు టెక్నాలజీ ఆధారంగా ఈవీఎంలను ట్యాంపర్ చేసే అవకాశం ఉందని అన్నారు.