Andhra Pradesh: టీడీపీ, కాంగ్రెస్ లకు షాక్.. వీవీప్యాట్లపై రివ్యూ పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు!
- 50 శాతం వీవీప్యాట్లు లెక్కించాలన్న ప్రతిపక్షాలు
- గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చబోమన్న సుప్రీం
- ఇప్పటికే లెక్కించే వీవీప్యాట్ల సంఖ్య 5కు పెంపు
కాంగ్రెస్, టీడీపీ, ఆప్ సహా 21 ప్రతిపక్ష పార్టీలకు సుప్రీంకోర్టు ఈరోజు షాక్ ఇచ్చింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) పోలైన ఓట్లను కనీసం 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాలన్న విపక్షాల రివ్యూ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది.
50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని ప్రతిపక్షాలు గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీన్ని విచారించిన ధర్మాసనం.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వీవీప్యాట్ యంత్రాలను ర్యాండమ్ గా లెక్కించాలని ఈసీని ఆదేశించింది.
అప్పటివరకూ కేవలం ఓ వీవీప్యాట్ యంత్రంలోని స్లిప్పులను మాత్రమే ఈవీఎంలతో సరిపోల్చేవారు. అయితే ఈ ఆదేశాలపై సంతృప్తి చెందని ప్రతిపక్షాలు ఈ సంఖ్యను 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ మరోసారి సుప్రీం మెట్లు ఎక్కాయి.