Telangana: పరీక్షల్లో ఫెయిల్ కావడం తట్టుకోలేక.. నర్సింగ్ విద్యార్థి ఆత్మహత్య!
- హైదరాబాద్ లో ఘటన
- నర్సింగ్ కోర్సు చేస్తున్న రోహన్
- పలు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావటంతో తీవ్రనిర్ణయం
ప్రస్తుతం విద్యార్థులు సున్నితంగా మారిపోతున్నారు. పరీక్షలలో ఫెయిల్ అయ్యామనీ, స్నేహితులు మాట్లాడటం లేదనీ, తల్లిదండ్రులు కొట్టారన్న మనస్తాపంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా పరీక్షల్లో ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతో ఓ నర్సింగ్ విద్యార్థి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఐదు అంతస్తుల బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
గుజరాత్ కు చెందిన రోహన్ అనే యువకుడు మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంటలోని విజయ స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో మూడేళ్ల నర్సింగ్ కోర్సులో చేరాడు. అయితే చదువు సరిగ్గా ఎక్కకపోవడంతో రెండో ఏడాది కొన్ని సబ్జెక్టుల్లో రోహన్ ఫెయిల్ అయ్యాడు. ఇటీవల జరిగిన సెమిస్టర్ లో మరికొన్ని పేపర్లలో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. దీంతో రోహన్ మనస్తాపానికి లోనయ్యాడు. ఆదివారం రాత్రి క్లినికల్ విధులు నిర్వహించిన అనంతరం తెల్లవారి హాస్టల్ కు వెళ్లాడు.
ఇంటికి వెళుతున్నానని స్నేహితులకు చెప్పి బ్యాగుతో గాంధీ ఆసుపత్రి వద్దకు చేరుకున్నాడు. అనంతరం ఐదో అంతస్తు పైకి వెళ్లి ఒక్కసారిగా కిందకు దూకేశాడు. ఈ ఘటనలో రోహన్ తల నేరుగా నేలకు తాకడంతో తీవ్ర రక్తస్రావమయింది. దీన్ని గమనించిన ఆసుపత్రి సిబ్బంది రోహన్ ను కాపాడేందుకు ప్రయత్నించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.