summer: తెలంగాణలో భానుడి నిప్పుల వాన.. బాణాపురంలో 46 డిగ్రీలు
- సోమవారం 46 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు
- మరో మూడు రోజులపాటు వడగాలులు
- జాగ్రత్తగా ఉండాలంటున్న వాతావరణశాఖ
తెలంగాణలో భానుడు రోజురోజుకు మరింత ఉగ్రరూపం దాలుస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. నేటి నుంచి మరో మూడు రోజులపాటు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ఎండలో తిరగడం మంచిది కాదని, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఖమ్మంలోని బాణాపురం, పమ్మిలో సోమవారం అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంలో 45.6 డిగ్రీలు, గుబ్బగుర్తి, సత్తుపల్లిలో 46.1, ఏన్కూరు, తిమ్మారావుపేటలో 45.7, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 46, జయశంకర్ జిల్లా మల్లూరులో 45.8, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.7, నల్గొండలో 44.8, ఆదిలాబాద్, నిజామాబాద్‌లో 43.8, హైదరాబాద్‌లో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.