YSRCP: గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షలో టీడీపీ ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు..ఈసీకి వైసీపీ నేతల ఫిర్యాదు

  • నిబంధనలకు విరుద్ధంగా ఏపీపీఎస్సీ వ్యవహరించింది
  • విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
  • ఈసీ ద్వివేదికి ఫిర్యాదు చేశాం: అంబటి

ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని వైసీపీ నేతలు ఈరోజు కలిశారు. గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షలో కోడ్ కు విరుద్ధంగా, టీడీపీ ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు అడగటంపై ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు అంబటి రాంబాబు, నాగిరెడ్డి కోరారు.కోవూరు రీపోలింగ్ ముందు ఓటర్లకు డబ్బులు పంచుతున్న వీడియోను, ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదికి అందజేశారు.

అనంతరం, మీడియాతో అంబటి మాట్లాడుతూ, గ్రూప్-2 ప్రిలిమినరి పరీక్షలో కోడ్ కు విరుద్ధంగా టీడీపీ ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు అడగడం దారుణమని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీపీఎస్సీ వ్యవహరించిందని, దానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్టు చెప్పారు.

పోలింగ్ ముగిసిన తర్వాత చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఓటమి పాలు కాబోతున్నామన్న విషయాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే,ఈవీఎంలు సరిగా పనిచేయలేదంటూ ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈసీపై చంద్రబాబు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈవీఎంలపై అనుమానాలు సృష్టించాలని బాబు కుట్ర పన్నుతున్నారని, ప్రభుత్వ వ్యవస్థలను ఆయన భ్రష్టుపట్టించారని దుమ్మెత్తిపోశారు. అన్ని వ్యవస్థలలోకి చంద్రబాబు తన మనుషులను చొప్పించారని విమర్శించారు. 

  • Loading...

More Telugu News