KCR: నేడు కేరళకు తెలంగాణ సీఎం.. ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చలు
- ఫెడరల్ ఫ్రంట్‌పై మరోమారు దృష్టి సారించిన కేసీఆర్
- నేడు పినరయి విజయన్‌తో భేటీ
- వామపక్షాలకూ ఆహ్వానం
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫెడరల్ ఫ్రంట్‌పై మరోమారు దృష్టి సారించారు. కాంగ్రెస్-బీజేపీయేతర ప్రభుత్వమే లక్ష్యంగా గత కొంతకాలంగా పావులు కదుపుతున్న కేసీఆర్ అందులో భాగంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. తొలుత నేడు కేరళ వెళ్లనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ప్రత్యేక విమానంలో తిరువనంతపురం చేరుకుంటారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సమావేశమవుతారు. అనంతరం తమిళనాడులోని రామేశ్వరం, శ్రీరంగం దేవాలయాలను సందర్శిస్తారు. ఆ రాష్ట్రంలో వివిధ పార్టీల నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత కర్ణాటక వెళ్తారు.
కేరళ సీఎం విజయన్ గతంలో హైదరాబాద్ వచ్చినప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులూ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు కూడా జరిపారు. కేసీఆర్ గతంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తోనూ ఫెడరల్ ఫ్రంట్ కోసం చర్చలు జరిపారు.
ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఈ నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ మరోమారు ఫెడరల్ ఫ్రంట్‌ను తెరపైకి తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఫెడరల్ ఫ్రంట్‌లో ప్రాంతీయ పార్టీలే ఉంటాయని ఇప్పటి వరకు చెప్పుకొచ్చిన కేసీఆర్ వామపక్ష కూటమి సీఎం పినరయి విజయన్‌తోనూ సమావేశం కావాలని నిర్ణయించడం గమనార్హం. ఫెడరల్ ఫ్రంట్‌ను ప్రతిపాదించిన తర్వాత తొలిసారి ఆయన వామపక్షాలవైపు మొగ్గుచూపుతున్నారు.