Bhimavaram: భీమవరంలో దారుణం... అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే మతిస్థిమితం తప్పింది!
- వికటించిన వైద్యం
- పిచ్చోడిలా మారిన యువకుడు
- కుటుంబ సభ్యుల ఆందోళన
ముఖంపై మచ్చలను తొలగించుకోవాలని డాక్టర్లను ఆశ్రయించిన యువకుడికి ఊహించని ఫలితం ఎదురైంది. కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్న సామెత ఆ యువకుడి విషయంలో నిజమైంది. అందం పెంచుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే ముఖం వికృతంగా తయారవడమే గాకుండా, మతిస్థిమితం కోల్పోయి పిచ్చివాడిలా మారిపోయాడు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన మారిణి శివ అనే యువకుడు బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. శివకు చిన్నప్పుడు ముఖంపై కాలడంతో మచ్చలు ఏర్పడ్డాయి. ఆ మచ్చలు తన పెళ్లికి అడ్డుగా ఉన్నాయని భావించి ప్లాస్టిక్ సర్జరీ సాయంతో వాటిని తొలగించుకుని అందంగా తయారవ్వాలని భావించాడు. భీమవరంలోని న్యూ లండన్ ఆసుపత్రిలో చేరాడు.
అక్కడి డాక్టర్ సుంకర అనిల్ రెండు విడతలుగా శివకు ముఖంపై శస్త్రచికిత్సలు నిర్వహించాడు. అయితే అప్పటినుంచి శివ ప్రవర్తనలో మార్పు రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తుండడంతో అతడి కుటుంబ సభ్యులు న్యూ లండన్ ఆసుపత్రి డాక్టర్లను సంప్రదిస్తే తమకు సంబంధంలేదు పొమ్మన్నారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పీఎస్ లో ఉన్న ఓ బైక్ ను నడిపేందుకు శివ చిన్నపిల్లాడిలా ప్రయత్నించడం చూసినవారు చలించిపోయారు.