Election commission: ఒక పార్టీకి ఎన్నికల సంఘం కొమ్ముకాయడం బాధాకరం: ఈసీకి కళావెంకట్రావు లేఖ
- ఈ ఎన్నికల్లో ఈసీ ఘోరంగా విఫలమైంది
- ప్రధాని మోదీ చెప్పుచేతల్లోని వ్యవస్థగా ఈసీ మారింది
- ‘కోడ్’ పేరుతో పాలనా వ్యవహారాలు కుంటుపడేలా చేయడం ప్రజాస్వామ్యమా?
ఒక జెండాకు, ఒక పార్టీకి ఎన్నికల సంఘం (ఈసీ) కొమ్ముకాయడం బాధాకరమని టీడీపీ నేత కళా వెంకట్రావు విమర్శించారు. ఈ మేరకు ఈసీకి టీడీపీ నేత కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో ఈసీ ఘోరంగా విఫలమైందని, ఎమర్జెన్సీని తలదన్నేలా దేశం నియంతృత్వ పోకడలకు బలైపోతోందని అన్నారు. ప్రధాని మోదీ చెప్పుచేతల్లోని వ్యవస్థగా ఈసీ మారిందని, ఈవీఎంల పనితీరు బాగుంటే 50 శాతం వీవీప్యాట్స్ లెక్కించేందుకు అభ్యంతరమేంటని ప్రశ్నించారు.
ఈసీ వైఖరిపై మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ సైనికాధికారులు రాష్ట్రపతికి లేఖ రాశారని, ఎన్నికల కోడ్ పేరుతో పాలనా వ్యవహారాలు కుంటుపడేలా చేయడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. అవకతవకలు ఉన్న నియోజకవర్గంలో ఎన్నికను రద్దు చేయాలని ఈ లేఖలో కోరారు.