Shibu Soren: సభలు పెట్టడు, ఒక పోస్టరూ ఉండదు, బ్యానర్లు అసలే కనిపించవు... అయినా ఎనిమిదిసార్లు ఎంపీగా గెలిచిన 'గురూజీ'!
- ఝార్ఖండ్ రాజకీయ దిగ్గజం శిబు సొరెన్ అద్వితీయ గాథ
- ప్రజల నేతగా గుర్తింపు
- ప్రజలే నెత్తినపెట్టుకుని ఆరాధిస్తున్న వైనం
ఇప్పటి పరిస్థితుల్లో రాజకీయాల్లో కొనసాగాలంటే మందీ మార్బలంతో పాటు డబ్బు కూడా పుష్కలంగా ఉండాలి. ఎన్నికలు వస్తే డబ్బు మంచినీళ్లలా ఖర్చయ్యే పరిస్థితి ఉంటుంది. ప్రచారానికి కోట్లు కుమ్మరించాలి. భారీ బహిరంగ సభలు, పోస్టర్లు, బ్యానర్లు, కార్యకర్తల పోషణ రూపంలో తడిసి మోపెడవుతుంది. ఇంతజేసీ గెలుపుపై గ్యారంటీ ఉండదు. కానీ, ప్రజల్లో నమ్మకమే పెట్టుబడిగా, సిద్ధాంతాలే ఊపిరిగా నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని ప్రస్థానం సాగిస్తున్న ఝార్ఖండ్ రాజకీయ దిగ్గజం శిబు సొరెన్ గురించి తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు.
74 ఏళ్ల సొరెన్ ఇప్పటివరకు ఎనిమిది సార్లు లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 16వ లోక్ సభలోనూ సొరెన్ సభ్యుడే. అంతేకాదు, ఝార్ఖండ్ కు మూడుసార్లు ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీ స్థాపించి జాతీయ పార్టీలకు సైతం కొరకరాని కొయ్యగా మారిన నేతగా గుర్తింపు పొందారు. శిబు సొరెన్ ప్రత్యేకత ఏంటంటే ఎన్నికలు వస్తే ఆయన చేసే పని నేరుగా ప్రజల మధ్యకు వెళ్లడమే. అదే తన విజయ రహస్యం అంటారు.
తాను ప్రాతినిధ్యం వహించే దుంకా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక పోస్టర్ కానీ, ఒక బ్యానర్ కానీ శిబు సొరెన్ పేరు మీద ఎక్కడా కనిపించదు. కనీసం ఒక బహిరంగ సభ నిర్వహించిన దాఖలాలు ఉండవు. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినా ఇక్కడ ఏమీ చేయలేడని సొరెన్ ధీమాగా చెప్పగలుగుతారంటే అందుకు కారణం అక్కడి ప్రజలపై ఆయనకున్న నమ్మకం, వారికి ఆయనపై ఉన్న అచంచల విశ్వాసం.
ప్రజల్లో శిబు సొరెన్ పట్ల ఉన్న ఆదరణకు ఈ ఘటనే నిదర్శనం అని చెప్పుకోవాలి. సాధారణంగా ప్రతిరోజూ రెండు సార్లు తన నివాసంలోనే ఆయన ప్రజల్ని కలుస్తుంటారు. తాజాగా, ఫణి తుపాను విశ్వరూపం ప్రదర్శిస్తూ ఝార్ఖండ్ ను కూడా స్పృశిస్తూ వెళ్లింది. దాంతో, ప్రజలు ఎవరూ బయటికి రావొద్దని, ఇళ్లలోనే ఉండాలని ఝార్ఖండ్ ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీచేసింది. అలాంటి పరిస్థితుల్లో కూడా కూడా సొరెన్ ను కలిసేందుకు దాదాపు 100 మంది ఆయన ఇంటివద్దకు చేరుకున్నారు.
1980లో ఇందిరాగాంధీ, 2014లో మోదీ ప్రభంజనం కొనసాగిన సమయంలో కూడా ఆ ప్రకంపనలు సొరెన్ ను తాకలేకపోయాయి. ఆయన యూపీఏ హయాంలో బొగ్గు శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అందరూ 'గురూజీ' అని పిలుచుకునే సొరెన్ సుదీర్ఘ రాజకీయ జీవితంలో కొన్ని వివాదాలు ఉన్నా ప్రజల్లో మాత్రం ఎప్పటికీ చెరగని స్థానం సంపాదించుకున్నారు.