Mamata: మమత ముందు కుప్పిగంతులా?... బీజేపీ కార్యకర్తల దౌడ్!

  • మమత కాన్వాయ్ ముందు జై శ్రీరామ్ నినాదాలు
  • కారు దిగగానే పారిపోయిన బీజేపీ శ్రేణులు
  • తెలివిగా తప్పించుకున్నారన్న మమత

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ముందు కుప్పిగంతులు వేయబోయిన బీజేపీ కార్యకర్తలు, ఆమె కారు దిగడం చూసి భయంతో పరుగు లంఘించుకున్నారు. వెస్ట్ మిడ్నాపూర్ లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే, మమతా బెనర్జీ కాన్వాయ్ వెళుతుండగా, బీజేపీ జెండాలు చేతబూని రోడ్డుకు ఇరువైపులా నిలబడిన కొందరు 'జై శ్రీరామ్... జై శ్రీరామ్' అంటూ నినాదాలు చేశారు.

దీంతో మమత ఆగ్రహంతో, కారును ఆపించి, డోర్ తీసి కిందకు దిగారు. ఆమె వేగంగా దిగడాన్ని చూసిన బీజేపీ కార్యకర్తలు పరుగు తీశారు. ఎందుకు పారిపోతున్నారని మమత అడిగినా వారు ఆగలేదు. ఇలా రండని పిలిచినా దగ్గరకు రాలేదు. వీళ్లంతా చాలా తెలివైనవారని, తన నుంచి తప్పించుకున్నారని వ్యాఖ్యానించిన ఆమె, ఆపై తన ప్రచారాన్ని కొనసాగించారు.

అనంతరం ఓ సభలో మాట్లాడుతూ, ఇక్కడ నినాదాలు చేస్తున్న వాళ్ల నోళ్లు మే 23 తరువాత మూతపడతాయని అన్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత వారంతా ఇక్కడే ఉండాల్సి వస్తుందని అన్నారు. ఇక ఈ ఘటనపై స్పందించిన బీజేపీ, జై శ్రీరామ్ నినాదాలు వింటే మమతకు కోపమెందుకని, అదేదో వినకూడని మాటలు విన్నట్టుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని ప్రశ్నించింది.

Mamata
West Bengal
BJP
Jai Sriram
  • Loading...

More Telugu News