Tirumala: టీటీడీ మరో ఘనత... ఒకే రోజు 9 సంస్థలకు ఐఎస్ఓ సర్టిఫికేషన్!

  • ధ్రువపత్రాలను అందుకున్న అనిల్ కుమార్ సింఘాల్
  • మాధవం గెస్ట్ హౌస్, పలు విద్యాసంస్థలకు గుర్తింపు
  • ఐదు టీటీడీ కల్యాణ మండపాలకు కూడా

అత్యాధునికంగా, కస్టమర్లకు సౌకర్యవంతంగా ఉండే సంస్థలకు ఐఎస్ఓ గుర్తింపు విషయంలో టీటీడీ మరో ఘనతను నమోదు చేసింది. టీటీడీకి చెందిన 9 సంస్థలకు ఒకేరోజు ఐఎస్ఓ గుర్తింపు లభించగా, ఇది ఓ రికార్డని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వ్యాఖ్యానించారు.

తిరుపతిలో యాత్రికుల వసతి సముదాయంగా ఉన్న మాధవం, శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్‌ కాలేజ్, శ్రీ పద్మావతి జూనియర్‌ కాలేజ్, శ్రీ వేంకటేశ్వర జూనియర్‌ కాలేజ్, కుప్పం, రాజాం, నర్సాపురం, మహబూబ్‌ నగర్‌, బెంగళూరులో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న కల్యాణ మండపాలకు ఐఎస్‌వో గుర్తింపు లభించింది. టీటీడీ పరిపాలనా భవనంలో ఈవోకు ఐఎస్‌వో ప్రతినిధులు ధ్రువపత్రాలను అందించారు.

కాగా, గతంలో విష్ణునివాసంకు ఐఎస్ఓ గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 9 సంస్థలకు గుర్తింపు లభించడంతో టీటీడీ పరిధిలోని 10 సంస్థలకు ఈ గుర్తింపు లభించినట్లయింది.

మాధవంలో 200 గదులుండగా, ఆన్‌ లైన్‌ విధానంలో గదుల బుకింగ్ తో పాటు మెరుగైన వసతులను కల్పించడం, భక్తులకు సూచిక బోర్డులు, మర్యాద పూర్వకంగా వ్యవహరించే సిబ్బంది తదితరాలను పరిశీలించిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ఈ గుర్తింపు ఇచ్చింది. ఇక విద్యా సంస్థల విషయానికి వస్తే, ఎక్కడి వారైనా విద్యను అభ్యసించే అవకాశం కల్పించడం, ఆన్ లైన్ ప్రవేశాలు, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పనకు అవకాశాలు, హిందూ ధర్మ పరిరక్షణ తదితరాంశాలను పరిగణనలోకి తీసుకున్నట్టు ఐఎస్ఓ ప్రతినిధులు వెల్లడించారు.

ఇక దేశవ్యాప్తంగా 297 కల్యాణ మండపాలను టీటీడీ నిర్వహిస్తుండగా, వీటిని పరిశీలించిన ఐఎస్ఓ బృందం మరుగుదొడ్ల నిర్వహణ నుంచి ముఖద్వారాల వరకూ అన్నింటినీ పరిశీలించి, కుప్పం, నర్సాపురం, మహబూబ్‌ నగర్‌, రాజాం, బెంగళూరు మండపాలు నిబంధనలకు తగ్గట్టుగా ఉన్నాయని తేల్చింది. 

  • Loading...

More Telugu News