Telangana: నిమ్స్ ఆసుపత్రి నుంచి తెలంగాణ బీజేపీ నేత లక్ష్మణ్ డిశ్చార్జ్!
- ఇంటర్ ఫలితాలపై లక్ష్మణ్ ఆందోళన
- గత నెల 29 నుంచి నిరాహార దీక్ష
- కేంద్ర మంత్రి రాకతో దీక్ష విరమణ
బీజేపీ తెలంగాణ చీఫ్ లక్ష్మణ్ ఈరోజు నిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంటర్ ఫలితాల గందరగోళం వ్యవహారంలో విద్యార్థులకు న్యాయం చేయాలంటూ గత నెల 29న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో లక్ష్మణ్ నిరాహార దీక్షకు దిగారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో దీక్షను భగ్నం చేసిన పోలీసులు నిమ్స్ కు తరలించారు. అయినా పట్టువదలని లక్ష్మణ్ ఆసుపత్రిలోనే దీక్షను కొనసాగించారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది.
ఈ సందర్భంగా ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆహారం తీసుకోవాలనీ, వైద్యం చేయించుకోవాలని కోరినా లక్ష్మణ్ అందుకు అంగీకరించలేదు. చివరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ ఆహిర్ నిమ్స్ కు చేరుకుని లక్ష్మణ్ ను పరామర్శించారు. అనంతరం ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. దీంతో ఈరోజు లక్ష్మణ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.