phani cyclone: శ్రీకాకుళం జిల్లా వాసులకు భారీ నష్టాన్ని మిగిల్చిన ‘ఫణి’ తుపాన్
- వివిధ రూపాల్లో 38.5 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా
- విద్యుత్, వ్యవసాయ రంగాలకు అత్యధిక నష్టం
- దెబ్బతిన్న 162 ఇళ్లు
ఉత్తరాంధ్ర వాసుల్ని వణికించి ఒడిశా తీరంవైపు దూసుకుపోయిన ‘ఫణి’ తుపాన్ వెళ్తూ వెళ్తూ శ్రీకాకుళం జిల్లా వాసులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. తీవ్రమైన గాలులు, వర్షాలకు ఇళ్లు, పంటలు నాశనమయ్యాయి. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. మిగిలిన రంగాలన్నింటితో కలిపి దాదాపు 38.5 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అత్యధికంగా విద్యుత్ శాఖకు నష్టం జరిగినట్లు లెక్కకట్టారు. కూలిన స్తంభాలు, దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మార్లు, తెగిన వైర్లతో తీర మండలాల్లో మొత్తం విద్యుత్ వ్యవస్థ అంతా ధ్వంసమయిందని, దీనివల్ల 9.75 లక్షల మేర నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అలాగే తుపాన్ ధాటికి 162 ఇళ్లు దెబ్బతిన్నాయని, దీనివల్ల 51.25 లక్షల నష్టం జరిగిందని తేల్చారు. 406 హెక్టార్లలో ఉద్యాన పంటలు, 1187 హెక్టార్లలో వరి, 555 హెక్టార్లలో వేరుశనగ పంట నాశనం కాగా 4 కోట్ల 9 లక్షల 48 వేల రూపాయల నష్టం జరిగినట్లు అంచనా వేశారు.
రోడ్లు, కాలువలు, వీధి దీపాలు, తాగునీటి పైపులైన్లు ధ్వంసం కావడం వల్ల 2 కోట్ల 13 లక్షల 60 వేల రూపాయలు, పశు సంవర్థక శాఖకు 3.49 లక్షల నష్టం జరిగిందని తేల్చారు. ఇక, తుపాన్ సమయంలో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు, వారికి అవసరమైన ఆహారం, మంచినీటి సరఫరా, ఇతరత్రా అవసరాల కోసం 31 లక్షల 89 వేలు ఖర్చు చేసినట్లు అధికారులు లెక్కతేల్చారు.
ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా మొత్తం 3334 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించగా వారికోసం 338 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేశారు. 11.169 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 123.500 మెట్రిక్ టన్నుల బంగాళదుంపలు తరలించినట్లు పేర్కొన్నారు. మంచినీటి సరఫరాతోపాటు 312 వైద్య శిబిరాల ఏర్పాటుకు ఈ మొత్తం ఖర్చు చేసినట్లు తేల్చారు.