Fani: ఈదురుగాలులు, కుంభవృష్టి నడుమ ఆడశిశువు జననం... 'ఫణి'గా నామకరణం!
- భువనేశ్వర్ లో ఘటన
- రైల్వే ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన రైల్వే ఉద్యోగిని
- తల్లీబిడ్డలు క్షేమం
తీవ్ర పెనుతుపాను ఫణి ఈ ఉదయం ఒడిశాలో తీరం దాటిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పూరీ, భువనేశ్వర్ ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉదయం 11.03 నిమిషాలకు భువనేశ్వర్ లోని రైల్వే ఆసుపత్రిలో ఓ మహిళ పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఓవైపు అతి భారీవర్షాలు, మరోవైపు ఈడ్చికొడుతున్న గాలులతో ఫణి తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్న సమయంలోనే ఆ పాప జన్మించింది. ఈ నేపథ్యంలో, ఆ పసికందుకు కుటుంబ సభ్యులు 'ఫణి' అని తుపాను పేరు పెట్టుకుని మురిసిపోయారు. ఆ బిడ్డకు జన్మనిచ్చిన యువతి మంచేశ్వర్ లోని రైల్వే కోచ్ రిపేర్ యూనిట్ లో హెల్పర్ గా పనిచేస్తోంది. ప్రసవం అనంతరం తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.